Skip to content
♪
Telugu Lyrics

Sundaradasu (Sri MS Rama Rao) Sundarakanda Part 1 – సుందరదాసు సుందరకాండ (ప్రథమ భాగం) – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

సుందరదాసు సుందరకాండ (ప్రథమ భాగం)

(కృతజ్ఞతలు: కీ.శే. సుందరదాసు శ్రీ ఎం.ఎస్.రామారావు గారికి, శ్రీ పి.శ్రీనివాస్ గారికి)

శ్రీ హనుమాను గురుదేవులు నా యెద

పలికిన సీతారామ కథ

నే పలికెద సీతారామ కథ .

శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు

అతి బలవంతుడు రామభక్తుడు .

లంకకు పోయి రాగల ధీరుడు

మహిమోపేతుడు శత్రుకర్శనుడు . 1

జాంబవదాది వీరులందరును

ప్రేరేపింపగ సమ్మతించెను .

లంకేశ్వరుడు అపహరించిన

జానకీమాత జాడ తెలిసికొన . 2

తన తండ్రి యైన వాయుదేవునకు

సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు .

వానరేంద్రుడు మహేంద్రగిరి పై

వందనములిడె పూర్వాభిముఖుడై . 3

రామనామమున పరవశుడయ్యె

రోమరోమమున పులకితుడయ్యె .

కాయము పెంచె కుప్పించి యెగసె

దక్షిణ దిశగా లంక చేరగా . 4

పవనతనయుని పదఘట్టనకే

పర్వతరాజము గడగడ వణకె .

ఫలపుష్పాదులు జలజల రాలె

పరిమళాలు గిరిశిఖరాలు నిండె . 5

పగిలిన శిలల ధాతువులెగసె

రత్నకాంతులు నలుదిశల మెరసె .

గుహలను దాగిన భూతములదిరి

దీనారవముల పరుగిడె బెదిరి . 6 | శ్రీ హనుమాను |

రఘుకులోత్తముని రామచంద్రుని

పురుషోత్తముని పావన చరితుని .

నమ్మిన బంటుని అనిలాత్మజుని

శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని . 7

నీ కడ కొంత విశ్రాంతి దీసికొని

పూజలందుకొని పోవచ్చునని .

సగర ప్రవర్థితుడు సాగరుడెంతో

ముదమున పలికె మైనాకునితో . 8

మైనాకుడు ఉన్నతుడై నిలిచె

హనుమంతుడు ఆగ్రహమున గాంచె .

ఇదియొక విఘ్నము కాబోలునని

వారిథి బడద్రోసె ఉరముచే గిరిని . 9

పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగె

పవనతనయుని బలము గని పొంగె .

తిరిగి నిలిచె హనుమంతుని పిలిచె

తన శిఖరముపై నరుని రూపమై . 10 | శ్రీ హనుమాను |

వానరోత్తమా ఒకసారి నిలుమా

నా శిఖరాల శ్రమ దీర్చుకొనుమా .

కందమూలములు ఫలములు తినుమా

నా పూజలు గొని మన్ననలందుమా . 11

శత యోజనముల పరిమితముగల

జలనిధినవలీల దాటిపోగల .

నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు

నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు . 12

పర్వతోత్తముని కరమున నిమిరి

పవనతనయుడు పలికెను ప్రీతిని .

ఓ గిరీంద్రమా సంతసించితిని

నీ సత్కారము ప్రీతినందితిని . 13

రామకార్యమై యేగుచుంటిని

సాధించువరకు ఆగనంటిని .

నే పోవలె క్షణమెంతో విలువలే

నీ దీవెనలే నాకు బలములే . 14 | శ్రీ హనుమాను |

అనాయాసముగ అంబరవీధిని

పయనము జేసెడు పవనకుమారుని .

ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు

పులకాంకితులై ప్రస్తుతించిరి . 15

రామకార్యమతి సాహసమ్మని

రాక్షసబలమతి భయంకరమని .

కపివరుడెంతటి ఘనతరుడోయని

పరిశీలనగా పంపిరి సురసను . 16

ఎపుడో నన్ను నిన్ను మ్రింగమని

వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని .

అతిగా సురస నోటిని దెరచె

హనుమంతుడలిగి కాయము బెంచె . 17

ఒకరినొకరు మించి కాయము బెంచిరి

శత యోజనములు విస్తరించిరి .

పై నుండి సురలు తహతహలాడిరి

ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి . 18

సురస ముఖము విశాలమౌట గని

సూక్ష్మబుద్ధి గొని సమయమిదేనని .

క్షణములోన అంగుష్ఠమాతృడై

ముఖము జొచ్చి వెలివచ్చె విజయుడై . 19

పవనకుమారుని సాహసము గని

దీవించె సురస నిజరూపము గొని .

నిరాలంబ నీలాంబరము గనుచు

మారుతి సాగెను వేగము పెంచుచు . 20

జలనిధి తేలే మారుతి ఛాయను

రాక్షసి సింహిక అట్టె గ్రహించెను .

గుహను బోలు తన నోటిని దెరచెను

కపివరుని గుంజి మ్రింగజూచెను . 21

అంతట మారుతి సూక్ష్మరూపమున

సింహిక ముఖమును చొచ్చి చీల్చెను .

సింహిక హృదయము చీలికలాయెను

సాగరమున బడి అసువులు బాసెను . 22

వారిథి దాటెను వాయుకుమారుడు

లంక చేరెను కార్యశూరుడు .

నలువంకలను కలయజూచుచు

నిజ రూపమున మెల్లగ సాగుచు . 23

త్రికూటాచల శిఖరముపైన

విశ్వకర్మ వినిర్మితమైన .

స్వర్గపురముతో సమానమైన

లంకాపురమును మారుతి గాంచెను . 24 | శ్రీ హనుమాను |

అనిలకుమారుడా రాత్రివేళను

సూక్ష్మరూపుడై బయలుదేరెను .

రజనీకరుని వెలుగున తాను

రజనీచరుల కనులబడకను . 25

పిల్లివలె పొంచి మెల్లగ సాగెను

ఉత్తర ప్రాకార ద్వారము జేరెను .

లంకారాక్షసి కపివరు గాంచెను

గర్జన సేయుచు అడ్డగించెను . 26

కొండ కోనల తిరుగాడు కోతివి

ఈ పురికి యే పనికై వచ్చితివి ?

లంకేశ్వరుని ఆనతి మేర

లంకాపురికి కావలి యున్నా . 27

లంకను నేను లంకాధిదేవతను

నీ ప్రాణములను నిలువున దీతును .

కదలక మెదలక నిజము పల్కుమని

లంక యెదుర్కొనె కపి కిశోరుని . 28

అతి సుందరమీ లంకాపురమని

ముచ్చటపడి నే చూడవచ్చితిని .

ఈ మాత్రమునకు కోపమెందుకులే

పురము గాంచి నే మరలిపోదులే . 29

అని నెమ్మదిగా పలుకగా విని

అనిలాత్మజుని చులకనగాగొని

లంకా రాక్షసి కపికిశోరుని

గర్జించి కసరి గద్దించి చరచెను . 30

సింహనాదమును మారుతి జేసె

కొండంతగ తన కాయము బెంచె .

వామ హస్తమున పిడికిలి బిగించె

ఒకే పోటున లంకను గూల్చె . 31

కొండ బండలా రక్కసి దొల్లె

కనులప్పగించి నోటిని దెరచె .

అబలను చంపుట ధర్మము గాదని

లంకను విడిచె మారుతి దయగొని . 32

ఓ బలభీమా ! వానరోత్తమా !

నేటికి నీచే ఓటమెరిగితి .

ఈ నా ఓటమి లంకకు చేటని

పూర్వమే బ్రహ్మ వరమొసగెనని . 33

రావణుడాదిగ రాక్షసులందరు

సీతమూలమున అంతమొందెదరు .

ఇది నిజమౌనని మీదే జయమని

లంకారాక్షసి పంపె హరేశుని . 34 | శ్రీ హనుమాను |

కోటగోడ అవలీలగ ప్రాకెను

కపికిశోరుడు లోనికి దుమికెను .

శత్రుపతనముగ వామపాదమును

ముందుగ మోపెను ముందుకు సాగెను . 35

ఆణిముత్యముల తోరణాలు గల

రమ్యతరమైన రాజవీధుల .

వెన్నెలలో లంకాపురి శోభను

శోధనగా హరేశుడు గాంచెను . 36

సువర్ణమయ సౌధరాజముల

ధగధగ మెరసే ఉన్నత గృహముల .

కళకళలాడే నవ్వుల జల్లులు

మంగళకరమౌ నృత్యగీతములు . 37

అప్సరసల మరపించు మదవతుల

త్రిస్థాయి బలుకు గానమాధురులు .

వెన్నెలలో లంకాపురి శోభను

శోధనగా హరేశుడు గాంచెను . 38

సుందరమైన హేమ మందిరము

రత్నఖచితమౌ సింహద్వారము .

పతాకాంకిత ధ్వజాకీర్ణము

నవరత్నకాంతి సంకీర్ణము . 39

నృత్య మృదంగ గంభీర నాదితము

వీణాగాన వినోద సంకులము .

లంకేశ్వరుని దివ్యభవనమది

శోధనగా హరేశుడు గాంచెను . 40

అత్తరు పన్నీట జలకములు

కాలాగరు సుగంధ ధూపములు .

స్వర్ణ ఛత్రములు వింజామరలు

కస్తూరి పునుకు జవాది గంధములు . 41

నిత్య పూజలు శివార్చనలు

మాస పర్వముల హోమములు .

లంకేశ్వరుని దివ్యభవనమది

శోధనగా హరేశుడు గాంచెను . 42 | శ్రీ హనుమాను |

యమకుబేర వరుణ దేవేంద్రాదుల

సర్వసంపదల మించినది .

విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది

బ్రహ్మవరమున కుబేరుడందినది . 43

రావణుండు కుబేరుని రణమందు

ఓడించి లంకకు గొని తెచ్చినది .

పుష్పకమను మహా విమానమది

మారుతి గాంచెను అచ్చెరువొందె . 44

నేలను తాకక నిలచియుండునది

రావణ భవన మధ్యంబుననున్నది .

వాయుపథమున ప్రతిష్ఠితమైనది

మనమున దలచిన ప్రీతిపోగలది . 45

దివినుండి భువికి దిగిన స్వర్గమది

సూర్యచంద్రులను ధిక్కరించునది .

పుష్పకమను మహా విమానమది

మారుతి గాంచెను అచ్చెరువొందె . 46

లంకాధీశుని ప్రేమ మందిరము

రత్నఖచితమౌ హేమ మందిరము .

చందనాది సుగంధ బంధురము

పానభక్ష్య పదార్థ సమృద్ధము . 47

ఆయా పరిమళ రూపానిలము

అనిలాత్మజుచే ఆఘ్రాణితము .

పుష్పకమందు రావణమందిరమ్మది

మారుతి గాంచెను అచ్చెరువొందె . 48

మత్తున శయనించు సుదతుల మోములు

పద్మములనుకొని మూగు భ్రమరములు .

నిమీలిత విశాల నేత్రములు

నిశాముకుళిత పద్మపత్రములు . 49

ఉత్తమ కాంతల గూడి రావణుడు

తారాపతి వలె తేజరిల్లెడు .

పుష్పకమందు రావణమందిరమ్మది

మారుతి గాంచెను అచ్చెరువొందె . 50

రావణుండు రణమందున గెలిచి

స్త్రీలెందరినో లంకకు జేర్చెను .

పితృ దైత్య గంధర్వ కన్యలు

ఎందెందరో రాజర్షి కన్యలు . 51

సీత తక్క వారందరు కన్యలె

రావణుమెచ్చి వరించిన వారలె .

పుష్పకమందు రావణమందిరమ్మది

మారుతి గాంచెను అచ్చెరువొందె . 52 | శ్రీ హనుమాను |

ఐరావతము దంతపు మొనలతో

పోరున బొడిచిన గంటులతో .

వజ్రాయుధపు ప్రఘాతములతో

చక్రాయుధపు ప్రహరణములతో . 53

జయపరంపరల గురుతులతో

కీర్తి చిహ్నముల కాంతులతో .

లంకేశుడు శయనించె కాంతలతో

సీతకై వెదకె మారుతి ఆశతో . 54

మినప రాశి వలె నల్లని వాడు

తీక్షణ దృక్కుల లోహితాక్షుడు .

రక్తచందన చర్చిత గాత్రుడు

సంధ్యారుణ ఘన తేజోవంతుడు . 55

సతులగూడి మధు గ్రోలిన వాడు

రతికేళి సలిపి సోలిన వాడు .

లంకేశుడు శయనించె కాంతలతో

సీతకై వెదకె మారుతి ఆశతో . 56

అందొక వంక పర్యంకము జేరి

నిదురించుచుండె దివ్యమనోహరి .

నవరత్నఖచిత భూషణధారిణి

నలువంకలను కాంతి ప్రసారిణి . 57

స్వర్ణదేహిని చారురూపిణి

రాణులకు రాణి పట్టపురాణి .

లంకేశ్వరుని హృదయేశ్వరి

మందోదరి లోకోత్తర సుందరి . 58

మందోదరిని జానకి యనుకొని

ఆడుచు పాడుచు గంతులు పెట్టి .

వాలము బట్టి ముద్దులు పెట్టి

నేలను గొట్టి భుజములు తట్టి . 59

స్తంభములెగసి క్రిందకు దుమికి

పల్లటీలు గొట్టి ఛెంగున జుట్టి .

చంచలమౌ కపిస్వభావమును

పవనతనయుడు ప్రదర్శన జేసెను . 60 | శ్రీ హనుమాను |

రాముని సీతా యిటులుండునా ?

రావణు జేరి శయనించునా ?

రాముని బాసి నిదురించునా ?

భుజయించునా భూషణముల దాల్చునా ? 61

పరమపురుషుని రాముని మరచునా ?

పరపురుషునితో కాపురముండునా ?

సీత కాదు కాదు కానేకాదని

మారుతి వగచుచు వెదకసాగెను . 62

పోవగరాని తావుల బోతి

చూడగరానివి యెన్నో జూచితి .

నగ్నముగా పరున్న పరకాంతల

పరిశీలనగా పరికించితిని . 63

రతికేళి సలిపి సోలిన రమణుల

ఎందెందరినో పొడగాంచితిని .

ధర్మము గానని పాపినైతినని

పరితాపముతో మారుతి కృంగెను . 64

సుదతుల తోడ సీతయుండగా

వారల జూడక వెదకుటెలాగ ?

మనసున యేమి వికారమునొందక

నిష్కామముగ వివేకము వీడక . 65

సీతను వెదకుచు చూచితి గాని

మనసున యేమీ పాపమెరుగనని .

స్వామి సేవ పరమార్థముగా గొని

మారుతి సాగెను సీత కోసమని . 66

భూమీగృహములు నిశాగృహములు

క్రీడాగృహములు లతాగృహములు .

ఆరామములు చిత్రశాలలు

బావులు తిన్నెలు రచ్చవీధులు . 67

మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్లు

సందులు గొందులు బాటలు తోటలు .

ఆగి ఆగి అడుగడుగున వెదకుచు

సీతను గానక మారుతి వగచె . 68

సీతామాత బ్రతికి యుండునో

కౄర రాక్షసుల పాల్పడి యుండునో ?

తాను పొందని సీత యెందుకని

రావణుడే హతమార్చి యుండునో ?69

అని యోచించుచు అంతట వెదకుచు

తిరిగిన తావుల తిరిగి తిరుగుచు .

ఆగి ఆగి అడుగడుగున వెదకుచు

సీతను గానక మారుతి వగచె . 70

సీత జాడ కనలేదను వార్తను

తెలిపిన రాముడు బ్రతుకజాలడు .

రాముడు లేనిదె లక్ష్మణుడుండడు

ఆపై రఘుకులమంతయు నిశించు . 71

ఇంతటి ఘోరము కాంచినంతనె

సుగ్రీవాదులు మడియక మానరు .

అని చింతించుచు పుష్పకము వీడి

మారుతి చేరె ప్రాకారము పైకి . 72

ఇంత వినాశము నా వల్లనేను

నే కిష్కింధకు పోనే పోను .

వానప్రస్థాశ్రమవాసుడనై

నియమ నిష్ఠలతో బ్రతుకువాడనై . 73

సీతామాతను చూచితీరెదను

లేకున్న నేను అగ్ని దూకెదను .

అని హనుమంతుడు కృత నిశ్చయుడై

నలుదెసల గనె సాహసవంతుడై . 74

చూడ మరచిన అశోక వనమును

చూపు మేరలో మారుతి గాంచెను .

సీతారామ లక్ష్మణాదులకు

ఏకాదశ రుద్రాది దేవులకు . 75

ఇంద్రాది యమ వాయుదేవులకు

సూర్యచంద్ర మరుద్గణములకు .

వాయునందనుడు వందనములిడి

అశోకవని చేరెను వడివడి . 76 | శ్రీ హనుమాను |

విరితేనియలు గ్రోలు భృంగములు

విందారగ సేయు ఝంకారములు .

లేజివురాకుల నెసవు కోయిలలు

పంచమ స్వరముల పలికే పాటలు . 77

పురులు విప్పి నాట్యమాడు నెమళులు

కిలకిలలాడే పక్షుల గుంపులు .

సుందరమైన అశోకవనమున

మారుతి వెదకెను సీతను కనుగొన . 78

కపికిశోరుడు కొమ్మకొమ్మను

ఊపుచు ఊగుచు దూకసాగెను .

పూవులు రాలెను తీవెలు తెగెను

ఆకులు కొమ్మలు నేలపై బడెను . 79

పూలు పై రాల పవనకుమారుడు

పుష్పరథము వలె వనమున దోచెడు .

సుందరమైన అశోకవనమున

మారుతి వెదకెను సీతను కనుగొన . 80

పూవులనిన పూతీవియలనిన

జానకికెంతో మనసౌనని .

పద్మపత్రముల పద్మాక్షుని గన

పద్మాకరముల కొంతె జేరునని . 81

అన్ని రీతులా అనువైనదని

అశోకవని సీత యుండునని .

శోభిల్లు శింశుపా తరుశాఖలపై

మారుతి కూర్చొని కలయజూచెను . 82 | శ్రీ హనుమాను |

సుందరమైన అశోకవనమున

తను కూర్చొనిన తరువు క్రిందున .

కృంగి కృశించిన సన్నగిల్లిన

శుక్లపక్షపు చంద్రరేఖను . 83

ఉపవాసముల వాడిపోయిన

నివురు గప్పిన నిప్పు కణమును .

చిక్కిన వనితను మారుతి గాంచెను

రాక్షస వనితల కౄర వలయమున . 84

మాసిన పీతవసనమును దాల్చిన

మన్నున పుట్టిన పద్మమును .

పతి వియోగ శోకాగ్ని వేగిన

అంగారక పీడిత రోహిణిని . 85

మాటిమాటికి వేడి నిట్టూర్పుల

సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను .

చిక్కిన వనితను మారుతి గాంచెను

రాక్షస వనితల కౄర వలయమున . 86

నీలవేణి సంచాలిత జఘనను

సుప్రతిష్టను సింహమధ్యను .

కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను

రతీదేవి వలె వెలయు కాంతను . 87

పుణ్యము తరిగి దివి నుండి జారి

శోక జలధి పడి మునిగిన తారను .

చిక్కిన వనితను మారుతి గాంచెను

రాక్షస వనితల కౄర వలయమున . 88

పతి చెంతలేని సతికేలనని

సీత సొమ్ముల దగిల్చె శాఖల .

మణిమయ కాంచన కర్ణవేష్ఠములు

మరకత మాణిక్య చంపసరాలు . 89

రత్నఖచితమౌ హస్త భూషలు

నవరత్నాంకిత మణిహారములు .

రాముడు దెలిపిన గురుతులు గలిగిన

ఆభరణముల గుర్తించె మారుతి . 90

సర్వ సులక్షణ లక్షిత జాత

సీతగాక మరి యెవరీ మాత ?

కౌసల్యా సుప్రజారాముని

సీతగాక మరి యెవరీ మాత ? 91

వనమున తపించు మేఘశ్యాముని

సీతగాక మరి యెవరీ మాత ?

ఆహా కంటి కనుగొంటి సీతనని

పొంగి పొంగి ఉప్పొంగె మారుతి . 92 | శ్రీ హనుమాను |

పూవులు నిండిన పొలములందున

నాగేటిచాలున జననమందిన .

జనక మహారాజు కూతురైన

దశరథ నరపాలు కోడలైన . 93

సీతాలక్ష్మికి కాదు సమానము

త్రైలోక్యరాజ్య లక్ష్మీ సహితము .

అంతటి మాతకా కాని కాలమని

మారుతి వగచె సీతను కనుగొని . 94

శత్రుతాపకరుడు మహాశూరుడు

సౌమిత్రికి పూజ్యురాలైన .

ఆశ్రితజన సంరక్షుడైన

శ్రీరఘురాముని ప్రియసతి యైన . 95

పతి సన్నిధియే సుఖమనియెంచి

పదునాల్గేండ్లు వనమునకేగిన .

అంతటి మాతకా కాని కాలమని

మారుతి వగచె సీతను కనుగొని . 96

బంగరు మేని కాంతులు మెరయ

మందస్మిత ముఖ పద్మము విరియ .

హంసతూలికా తల్పమందున

రాముని గూడి సుఖింపగ తగిన . 97

పురుషోత్తముని పావనచరితుని

శ్రీరఘురాముని ప్రియసతి యైన .

అంతటి మాతకా కాని కాలమని

మారుతి వగచె సీతను కనుగొని . 98 | శ్రీ హనుమాను |

మూడు ఝాముల రేయి గడువగా

నాల్గవ ఝాము నడచుచుండగా .

మంగళవాద్య మనోహర ధ్వనులు

లంకేశ్వరుని మేలుకొలుపులు . 99

క్రతువులొనర్చు షడంగవేదవిదుల

స్వరయుగ శబ్దతరంగ ఘోషలు .

శోభిల్లు శింశుపా శాఖలందున

మారుతి కూర్చొని ఆలకించెను . 100

రావణాసురుడు శాస్త్రోక్తముగా

వేకువనే విధులన్ని యొనర్చెను .

మదోత్కటుడై మదనతాపమున

మరిమరి సీతను మదిలో నెంచెను . 101

నూర్గురు భార్యలు సురకన్యల వలె

పరిసేవింపగ దేవేంద్రుని వలె .

దశకంఠుడు దేదీప్యమానముగ

వెడలెను అశోకావనము చేరగా . . 102

లంకేశునితో వెడలిరి సతులు

మేఘము వెంట విద్యుల్లతల వలె .

మధువు గ్రోలిన పద్మముఖుల

ముంగురులు రేగె భృంగముల వలె . 103

క్రీడల తేలిన కామినీమణుల

నిద్రలేమి పడు అడుగులు తూలె .

దశకంఠుడు దేదీప్యమానముగ

చేరెను అశోకావనము వేగముగ . 104

లంకేశుని మహా తేజమును గని

మారుతి కూడ విభ్రాంతి జెందెను .

దశకంఠుడు సమీపించి నిలిచెను

సీతపైననే చూపులు నిలిపెను . 105

తొడలు చేర్చుకొని కడుపును దాచి

కరములు ముడిచి చనుగన దాచి

సుడిగాలి పడిన కదళీ తరువు వలె

కటిక నేలపై జానకి తూలె . 106 | శ్రీ హనుమాను |

ఓ సీతా ! ఓ పద్మనేత్రా !

నా చెంత నీకు యేల చింత ?

ఎక్కడి రాముడు ? ఎక్కడి అయోధ్య ?

ఎందుకోసమీ వనవాస వ్యథ ? 107

నవయవ్వన త్రిలోకసుందరీ

నీకెందుకు యీ మునివేషధారి ?

అని రావణుడు కామాంధుడై నిలిచె

నోటికి వచ్చినదెల్ల పలికె . 108

రాముడు నీకు సరిగానివాడు

నిను సుఖపెట్టడు తను సుఖపడడు .

గతిచెడి వనమున తిరుగుచుండెనో

తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో . 109

మరచిపొమ్ము ఆ కొరగాని రాముని

వలచి రమ్ము నను యశోవిశాలుని .

అని రావణుడు కామాంధుడై నిలిచె

నోటికి వచ్చినదెల్ల పలికె . 110

రాముడు వచ్చుట నన్ను గెల్చుట

నిన్ను పొందుట కలలోని మాట .

బలవిక్రమ ధన యశములందున

అల్పుడు రాముడు నా ముందెందున . 111

యమ కుబేర ఇంద్రాది దేవతల

గెలిచిన నాకిల నరభయమేల ?

అని రావణుడు కామాంధుడై నిలిచె

నోటికి వచ్చినదెల్ల పలికె . 112 | శ్రీ హనుమాను |

నిరతము పతినే మనమున దలచుచు

క్షణమొక యుగముగ కాలము గడుపుచు .

రావణ గర్వమదంబుల ద్రుంచు

రాముని శౌర్యధైర్యముల దలచుచు . 113

శోకతప్తయై శిరమును వంచి

తృణమును ద్రుంచి తన ముందుంచి .

మారు పల్కె సీత దీనస్వరమున

తృణముకన్న రావణుడే హీనమన . 114

రామలక్ష్మణులు లేని సమయమున

అపహరించితివె నను ఆశ్రమమున .

పురుష సింహముల గాలికి బెదిరి

పారిపోతివి శునకము మాదిరి . 115

యమ కుబేర ఇంద్రాది దేవతల

గెలిచిన నీకీ వంచనలేల ?

అని పల్కె సీత దీన స్వరమున

తృణముకన్న రావణుడే హీనమన . 116

ఓయి రావణా ! నా మాట వినుము

శ్రీరామునితో వైరము మానుము .

శీఘ్రముగా నను రాముని జేర్చుము

త్రికరణ శుద్ధిగా శరణు వేడుము . 117

నిను మన్నించి అనుగ్రహింపుమని

కోరుకొందు నా కరుణామూర్తిని .

అని పల్కె సీత దీన స్వరమున

తృణముకన్న రావణుడే హీనమన . 118 | శ్రీ హనుమాను |

ఓ సీతా ! నీవెంత గడసరివె

ఎవరితో యేమి పల్కుచుంటివె ?

ఎంతటి కర్ణ కఠోర వచనములు

ఎంతటి ఘోర అసభ్య దూషణలు . 119

నీపై మోహము నను బంధించెను

లేకున్న నిను వధించియుందును .

అని గర్జించెను ఘనతరగాత్రుడు

క్రోధోద్దీప్తుడై దశకంఠుడు . 120

నీకొసగిన ఏడాది గడువును

రెండు నెలలలో తీరిపోవును .

అంతదనుక నిన్నంటగ రాను

ఈలోపున బాగోగులు కనుగొను . 121

నను కోరని నిను బలాత్కరించను

నను కాదను నిను కనికరించను .

అని గర్జించెను ఘనతరగాత్రుడు

క్రోధోద్దీప్తుడై దశకంఠుడు . 122

ఓ రావణా ! నీ క్రొవ్విన నాలుక

గిజగిజలాడి తెగిపడదేమి ?

కామాంధుడా నీ కౄర నేత్రములు

గిర గిర తిరిగి రాలిపడవేమి ?123

పతియాజ్ఞ లేక యిటులుంటి గాని

తృటిలో నిన్ను దహింపనా యేమి ?

అని పల్కె సీత దివ్య స్వరమున

తృణముకన్న రావణుడే హీనమన . 124

క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు

కొరకొర జూచుచు నిప్పులు గ్రక్కుచు .

తన కాంతలెల్ల కలవరమొందగ

గర్జన సేయుచు దిక్కులదరగ . 125

సీతనెటులైన వొప్పించుడని

వొప్పుకొననిచో భక్షించుడని .

రావణాసురుడు అసురవనితలను

ఆజ్ఞాపించి మరలిపోయెను . 126 | శ్రీ హనుమాను |

అందున్న వొక వృద్ధ రాక్షసి

తోటి రాక్షసుల ఆవల ద్రోసి .

కావలెనన్న నన్ను వేధింపుడు

సీతను మాత్రము హింసింపకుడు . 127

దారుణమైన కలగంటి నేను

దానవులకది ప్రళయమ్మేను .

అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము

భయకంపితలైరి రాక్షసీ గణము . 128

శుక్లాంబరములు దాల్చినవారు

రామలక్ష్మణులు అగుపించినారు .

వైదేహికి యిరువంకల నిలచి

దివ్యతేజమున వెలుగొందినారు . 129

తెల్లని కరిపై మువ్వురు కలసి

లంకాపురిపై పయనించినారు .

అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము

భయకంపితలైరి రాక్షసీ గణము . 130

దేవతలందరు పరిసేవింప

ఋషిగణంబులు అభిషేకింప .

గంధర్వాదులు సంకీర్తింప

బ్రహ్మాదులు మునుముందును దింప . 131

సీతారాముడు విష్ణుదేవుడై

శోభిల్లెను కోటి సూర్య తేజుడై .

అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము

భయకంపితలైరి రాక్షసీ గణము . 132

తైలమలదుకొని రావణాసురుడు

నూనె త్రాగుచూ అగుపించినాడు .

కాలాంబరమును ధరియించినాడు

కరవీరమాల దాల్చినాడు . 133

పుష్పకమందుండి నేలబడినాడు

కడకొక స్త్రీచే యీడ్వబడినాడు .

అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము

భయకంపితలైరి రాక్షసీ గణము . 134 | శ్రీ హనుమాను |

రావణుండు వరాహముపైన

కుంభకర్ణుడు ఒంటెపైన .

ఇంద్రజిత్తు మకరముపైన

దక్షిణ దిశగా పడిపోయినారు . 135

రాక్షసులందరు గుంపుగుంపులుగ

మన్నున కలిసిరి సమ్మూలమ్ముగ .

అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము

భయకంపితలైరి రాక్షసీ గణము . 136

తెల్లని మాలలు వలువలు దాల్చి

తెల్లని గంధము మేన బూసికొని .

నృత్య మృదంగ మంగళ ధ్వనులతో

చంద్రకాంతులెగజిమ్ము ఛత్రముతో . 137

తెల్లని కరిపై మంత్రివర్యులతో

వెడలె విభీషణుడు దివ్యకాంతితో .

అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము

భయకంపితలైరి రాక్షసీ గణము . 138

విశ్వకర్మ నిర్మించిన లంకను

రావణుండు పాలించెడు లంకను .

రామదూత వొక వానరోత్తముడు

రుద్రరూపుడై దహియించినాడు . 139

ప్రళయ భయానక సదృశమాయెను

సాగరమున లంక మునిగిపోయెను .

అని పల్కు త్రిజట మాటలు వినుచు

నిద్రతూగిరి రాక్షస వనితలు . 140

హృదయ తాపమున జానకి తూలుచు

శోకభారమున గడగడ వణకుచు .

జరిగి జరిగి అశోక శాఖలను

ఊతగాగొని మెల్లగ నిలచి . 141

శ్రీరాముని కడసారి తలచుకొని

తన మెడజడతో వురిపోసుకొని .

ప్రాణత్యాగము చేయబూనగా

శుభ శకునములు తోచె వింతగా . 142

సీతకెంత దురవస్థ ఘటిల్లె

నా తల్లినెటుల ఊరడించవలె ?

నన్ను నేనెటుల తెలుపుకోవలె

తల్లినెటుల కాపాడుకోవలె ?143

యే మాత్రము నే ఆలసించినా

సీతామాత ప్రాణములుండునా ?

అని హనుమంతుడు శాఖలమాటున

తహతహలాడుచు మెదలసాగెను . 144

నను గని జానకి బెదరక ముందే

పలికెద సీతారామ కథ .

సత్యమైనది వ్యర్థము గానిది

పావనమైనది శుభకరమైనది . 145

సీతా మాతకు కడు ప్రియమైనది

పలుకు పలుకున తేనెలొలుకునది .

అని హనుమంతుడు మృదుమధురముగా

పలికెను సీతారామ కథ . 146

దశరథ విభుడు రాజోత్తముడు

యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు .

దశరథునకు కడు ప్రియమైన వాడు

జ్యేష్ఠ కుమారుడు శ్రీరఘురాముడు . 147

సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు

పితృవాక్య పరిపాలన శీలుడు .

అని హనుమంతుడు మృదుమధురముగా

పలికెను సీతారామ కథ . 148

శ్రీ రాముని పట్టాభిషేకము

నిర్ణయమైన శుభసమయమున .

చిన్న భార్య కైక దశరథు చేరి

తనకొసగిన రెండు వరములు కోరె . 149

భరతునకు పట్టాభిషేకము

పదునాల్గేండ్లు రామ వనవాసము .

అని హనుమంతుడు మృదుమధురముగా

పలికెను సీతారామ కథ . 150 | శ్రీ హనుమాను |

[download id=”398439″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
సుందరదాసు సుందరకాండ (ప్రథమ భాగం)
(కృతజ్ఞతలు: కీ.శే. సుందరదాసు శ్రీ ఎం.ఎస్.రామారావు గారికి, శ్రీ పి.శ్రీనివాస్ గారికి)
Preview the status creator
SAMPLE
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
Preview the status creator